బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో బీజేపీ పాలకవర్గం విఫలం

19-10-2026 | 04:50pm

కరీంనగర్ సిటీ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ(Batukamma Festival)కు కనీస ఏర్పాట్లు చేయకపోవడం మహిళలను, బతుకమ్మ తల్లిని అవమానించడమేనని విమర్శించారు. సోమవారం కరీంనగర్‌ లోని మంకమ్మతోటలో తన డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో కరీంనగర్‌లో బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించేవారని హరిశంకర్‌ గుర్తుచేశారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రత్యేక వేదికలు, విద్యుద్దీపాలు, మైకులు, సౌండ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసేవారని తెలిపారు. ప్రతి డివిజన్‌లోనూ మహిళలు బతుకమ్మ ఆడేందుకు, నిమజ్జనం చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారన్నారు. ప్రస్తుత బీజేపీ పాలకవర్గం మాత్రం కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

నగరంలోని దాదాపు అన్ని డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జన పాయింట్ల వద్ద సరైన లైటింగ్‌, మైకులు, సౌండ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయలేదని హరిశంకర్‌ విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో  పూర్తి చిమ్మచీకటి నెలకొనడంతో మహిళలు సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిమజ్జన ప్రాంతాల్లోనూ తగిన వెలుతురు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

నగరంలో 66 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌లో కనీసం 25 నుంచి 50 వరకు బతుకమ్మ పాయింట్లు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో అవసరానికి తగినన్ని లైట్లు ఏర్పాటు చేసి, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూసేవారని చెప్పారు. ప్రస్తుత పాలకవర్గం మాత్రం పలు ప్రాంతాల్లో నామమాత్రంగా లైట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కొన్ని పాయింట్లలో రెండు లైట్లు మాత్రమే ఏర్పాటు చేయడం, మరికొన్ని చోట్ల కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడం పాలకవర్గం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లుగా మిగిలిన డివిజన్లలో ఎందుకు చేయలేదని హరిశంకర్‌ ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పాయింట్ల వద్ద ఏర్పాట్లు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందన్నారు. ఏడు రోజులకే బతుకమ్మ వేడుకలు ముగిసిన కొన్ని ప్రాంతాల్లోనూ సరైన ఏర్పాట్లు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్న ప్రాంతాల్లో సైతం పండుగల నిర్వహణకు స్థానికంగా ఏర్పాట్లు చేసుకునేవారని గుర్తుచేశారు. నగరపాలక సంస్థగా విస్తరించిన తర్వాత మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారాయని విమర్శించారు.

బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని తెలిపారు. పూలను బతుకమ్మగా పేర్చి అమ్మవారిగా పూజించడం తెలంగాణ ప్రత్యేకతని పేర్కొన్నారు. కుటుంబాలు, సమాజం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మహిళలు బతుకమ్మను పూజించి నిమజ్జనం చేస్తారని వివరించారు. అలాంటి పండుగలో మహిళలు ఇబ్బందులు పడేలా చేయడం సరికాదన్నారు

కరీంనగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌, నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌, బీజేపీ కార్పొరేటర్లు ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో నగరాన్ని అభివృద్ధి చేస్తామని, అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు జరిగిన లోపాలకు బాధ్యత వహించాలన్నారు. కేంద్ర మంత్రి స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి, నగరంలోని అన్ని డివిజన్లలో పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

దసరా వేడుకలకైనా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ వేడుకల్లో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా దసరా సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హరిశంకర్‌ కోరారు. నగరంలోని 16 ప్రాంతాల్లో నిర్వహించనున్న రావణ దహనం, రామలీలా కార్యక్రమాలు, జమ్మి పూజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో లైటింగ్‌, సౌండ్‌ వ్యవస్థలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పండుగల నిర్వహణలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. బతుకమ్మ వేడుకల్లో జరిగిన నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి, నగర మేయర్‌ స్పందించాలని, నగర మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చల్ల హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చల్ల హరిశంకర్ వెంట  మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్,బోనాల శ్రీకాంత్,  టిఆర్ఎస్ పార్టీ నగరం ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బి ఆర్ ఎస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బండ శ్రీకాంత్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరే రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, మేరుగు శ్రీనివాస్, తొంటి రాజేందర్, నారదాసు వసంత రావు, సైఫ్, కిరణ్, విజ్ఞాన్ శ్రీనివాస్, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు