వరల్డ్ మేయర్స్ ఫోరం సదస్సుకు కరీంనగర్ మేయర్

24-11-2026 | 06:06pm

ముకరంపుర, నవంబర్ 24 (విజయక్రాంతి): ముంబై వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక '3వ వరల్డ్ మేయర్స్ ఫోరం' అంతర్జాతీయ సదస్సుకు కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్‌(Mayor Kolagani Srinivas)కు ఆహ్వానం అందింది. ఈ నెల 25 , 26న ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్ వేదికగా ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న  దాదాపు 30 దేశాల  నగరాల మేయర్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్ నగరాల అభివృద్ధిపై చర్చించనున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మొదటి రోజు  ప్రారంభ సమావేశం అనంతరం 'భారతదేశం 2047 కోసం ప్రణాళిక - 2047 నాటికి నగరాలను పునర్నిర్మించడం', ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్ నగరాల నిర్వహణ, పట్టణ వ్యర్థాల సమస్య పరిష్కారం, సర్క్యులర్ సిటీస్, ప్రపంచ పెట్టుబడుల ద్వారా స్థానిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై సాంకేతిక సమావేశాలు జరగనున్నాయి. రెండవ రోజు నగరాలను మరింత సురక్షితంగా మార్చడం, నదీ నగరాల అభివృద్ధి, ప్రజల ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ రవాణా వ్యవస్థ, నెట్-జీరో మౌలిక సదుపాయాలు, వాతావరణ సంక్షోభం ఎదుర్కోవడం, మెట్రోపాలిటన్ పాలన బలోపేతం మరియు క్రీడా దౌత్యం ద్వారా ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ముగింపు సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు