జాతీయ సదస్సులో పాల్గొన్న పారమిత విద్యాసంస్థల ప్రతినిధులు
కొత్తపల్లి, అక్టోబర్ 27(విజయక్రాంతి): న్యూఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో(Dr. B.R. Ambedkar International Centre) అక్టోబర్ 26, 27 తేదీల్లో నిర్వహించిన నాల్గవ సీబీఎస్ఈ జాతీయ సదస్సులో కరీంనగర్ పట్టణనికి చెందిన పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ కె.హన్మంతరావు, ప్రిన్సిపాళ్లు పి.గోపీకృష్ణ, యం.శ్రీకర్ లు హాజరయ్యారు.'ఫెసిలిటేటింగ్ స్కూల్స్ టు వర్క్ ట్రాన్సిషన్' (పాఠశాల విద్య నుంచి ఉపాధి వైపు పయనం) అనే ప్రధాన ఇతివృత్తంతో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించారు.
జాతీయ విద్యా విధానం-2020 అమలు, నైపుణ్యాధారిత విద్య, విద్యార్థులను ఉపాధికి సిద్ధం చేయడంలో పాఠశాలల పాత్ర తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమస్యల పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారిని సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. సదస్సులో చర్చించిన విద్యా విధానాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పారమిత విద్యాసంస్థల్లో గత 15 ఏళ్లుగా అమలు చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ జాతీయ సదస్సులో కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి టి. అనిల్ కుమార్, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధే, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ ప్రాచీ పాండే, సీబీఎస్ఈ స్కిల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిస్వజిత్ సాహా తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన పారమిత పాఠశాల ప్రతినిదులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు.