పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు
హుజురాబాద్,అక్టోబర్25: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంటలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను(Police Martyrs' Commemoration Week) పురస్కరించుకుని పోలీసు సిబ్బంది ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇల్లంతకుంట ఎస్సై క్రాంతి కుమార్(Illanthakunta SI Kranthi Kumar) ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు సిరిసేడు చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమం, పోలీసు సిబ్బంది ఆయురారోగ్యాలు, ప్రజల భద్రత, శాంతి సౌభాగ్యాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.