సర్పంచ్‌పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

17-10-2026 | 06:32pm

మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి

హుజురాబాద్,అక్టోబర్ 17: (విజయక్రాంతి) : గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్‌పై(Machamalla Srikanth) కులం పేరుతో దూషిస్తూ చెప్పులు, రాళ్లతో దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocity Case) నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి(Pasula Swamy) డిమాండ్ చేశారు. సైదాపూర్ మండలం(Saidapur Mandal) గర్రెపల్లి గ్రామంలో ఈ నెల 15న చోటుచేసుకున్న ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

బతుకమ్మ ఆడే స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ శ్రీకాంత్‌ను వరికిల అశ్విని, ఆమె భర్త వరికిల కుమార్ కులం పేరుతో దూషిస్తూ అవమానించారని పసుల స్వామి ఆరోపించారు. అంతటితో ఆగకుండా చెప్పులు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా దాడికి పాల్పడటమే కాకుండా, మరోసారి గ్రామానికి వస్తే చంపుతామని బెదిరించినట్లు తెలిపారు.

ఈ దాడిలో శ్రీకాంత్ కుడి చెవికి రక్తగాయమైందని, భుజం, చేతి వేళ్లకు రాళ్ల దెబ్బలు తగిలాయని వివరించారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా కులం పేరుతో దూషించి దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని  స్వామిహెచ్చరించారు.

మరిన్ని వార్తలు