చిన్న పర్మిట్ రూముల పేరుతో పెద్ద బార్ల నిర్వహణ!

30-10-2026 | 03:15pm

వైన్స్ షాపుల్లో నిబంధనలకు తూట్లు.. అధికారుల తీరుపై కొలిపాక సమ్మయ్య ఆగ్రహం

హుజురాబాద్, అక్టోబర్ 30:(విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణ పరిధిలోని పలు వైన్స్ షాపులు(Wine shops) ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చిన్న పర్మిట్ రూముల పేరుతో పెద్ద బార్ షాపులను నిర్వహిస్తున్నాయని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్(Karimnagar District Vice-President Kolipaka Sammayya Mudiraj) ఆరోపించారు.

పరకాల క్రాస్ రోడ్డు, సుధాకర్ పెట్రోల్ బంకు పక్కన, జమ్మికుంట రోడ్డుతో పాటు చెల్పూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయానికి సమీపంలో ఉన్న వైన్స్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. వైన్స్ షాపుల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి పర్మిట్ రూములను విస్తరించి, కిచెన్లు ఏర్పాటు చేసి బార్ల తరహాలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ బాటిళ్లతో పాటు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తూ, నాణ్యతలేని ఆహారం, కుళ్లిన మాంసాహార వంటకాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఆబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పర్మిట్ రూములపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైన్స్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొలిపాక సమ్మయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు