కాంగ్రెస్ పాలనలో రైతులకు దగా..

16-10-2026 | 02:51pm
  1. రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్, నీటి కొరత:
  2. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ధ్వజం*
  3. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
  4. రైతుల మొదటి పంటకే దిక్కులేదు.. రెండో పంట వేయొద్దనడం సిగ్గుచేటు
  5. తెలంగాణ నీటిని వదిలేసి ఆంధ్ర పాలకులకు కానుకగా ఇచ్చారు

ఖమ్మం, అక్టోబర్ 16(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office) తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడవకముందే రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డులు, రాసిచ్చిన బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయిందని అన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఇంటింటికీ నల్లా నీళ్లు, మిషన్ కాకతీయతో చెరువులను నింపి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, బోర్ల దగ్గర బిందెలతో ఎదురుచూసే దుస్థితి, కరెంట్ లేక మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే విపత్కర పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే, కేవలం 6,700 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తూ మిగతా లోటును పూడ్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా పాల్గొన్న సమావేశాల్లోనే కరెంట్ పోయే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

గోదావరిలో 326.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే, కేవలం 174.58 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసి, 750 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి ఇక్కడి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా, కేసీఆర్‌కి పేరు వస్తుందనే దుగ్ధతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు.

రెండో పంట వేయొద్దని రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్న మంత్రులు.. తమ వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు, 15 శాతం కమీషన్ల దందాలను ఆపుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. విత్తన కంపెనీలకు నోటీసులు ఇచ్చి రెండో పంటకు విత్తనాలు అమ్మొద్దని చెప్పడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ‌ నల్ల బంగారం ఉన్న గడ్డ మన తెలంగాణ అని, కావలసినన్ని బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కృత్రిమంగా కొరత సృష్టించి థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గించారని విమర్శించారు. 2023-24లో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగితే, ప్రస్తుత ఏడాదిలో దాన్ని 58 మిలియన్ టన్నులకు ఎందుకు తగ్గించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సింగరేణిని నిర్వీర్యం చేసి విదేశీ బొగ్గు దిగుమతి పేరిట భారీగా కమిషన్లు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాన్ని అధికారులపై నెట్టేస్తూ వారిని బెదిరించడం పరిపాలనా చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. అధికారులే మాట వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే చేతులెత్తేస్తే ఇక ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో మండల & నగర పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, నాయకులు బత్తుల మురళి, పగడాల నరేందర్, బలుసు మురళీకృష్ణ, యలమద్ది రవి, మహమ్మద్ రఫీ, దరిపెల్లి వీరబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు