దుర్గామాత అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
దుర్గామాత మండపం వద్ద మహా చండీ హోమం...
ఆటపాటలతో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు.. ఘనంగా నిమజ్జనం...
సింగరేణి (విజయక్రాంతి): కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు(Navaratri Festival) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గామాత మండపం వద్ద మహా చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో భక్తులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.భక్తుల జయజయధ్వానాలు, అమ్మవారి నామస్మరణతో బీసీ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో మహిళలు, యువకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు, మహా చండీ హోమం, బాలికల అమ్మవారి అవతారంలో నృత్యాలు, అమ్మవారి నిమజ్జన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.