రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు

03-11-2026 | 12:00am
  1. సదాశివునిపాలెంలో రోడ్డు ప్రమాదం
  2. ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి మృతి
  3. రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

సత్తుపల్లి నవంబర్ 2 ( విజయ క్రాంతి): రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు(Criminal cases registered) సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో రోడ్డుపై ధాన్యం ఆరబోయడం కారణంగా జరిగిన ప్రమాదంలో తుంబూరు గ్రామానికి చెందిన తురకా రాంబాబు అనే వ్యక్తి మృతి చెందాడు.

సదాశివునిపాలెం గ్రామానికి చెందిన గాయం రాము, చాట్ల లక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ రహదారిపై వరి ధాన్యం ఆరబోశారు. అదే సమయంలో అటుగా మోటార్ సైకిల్‌పై వస్తున్న తురకా రాంబాబు ధాన్యం కుప్పను ఢీకొని, ధాన్యం కుప్పపై నుంచి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు రోడ్డుపై ధాన్యం ఆరబోసి ప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.

రోడ్లపై ధాన్యం ఆరబోసే విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలకు పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రహదారులపై ధాన్యం ఆరబోయడమే కాకుండా, ధాన్యంపైకి వాహనాలు రాకుండా రోడ్డు మధ్యలో పెద్దపెద్ద రాళ్లు, ముళ్ల కంచెలు, కట్టెలు పెడుతున్నారని తెలిపారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

కావున, ఈ విధంగా రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో పూర్తి బాధ్యత ధాన్యం యజమానులదేనని స్పష్టం చేశారు.

రైతులు తమ పంటను రోడ్లపై కాకుండా ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీ.పీ.సీలు) లేదా గ్రామాల్లోని ప్రత్యామ్నాయ కల్లాల్లో మాత్రమే ఆరబెట్టుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు