చేనేతకు మహర్దశ!
- నవంబర్ 2 నుంచి 15 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన
- ప్రజలు సందర్శించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, నవంబర్ 2 (విజయ క్రాంతి ): కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ(Union Ministry of Textiles), డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ, చేనేత సహకార సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎన్.జి.ఓస్ కాలనీలోని రెడ్డి మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శనను సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Dr. Satya Sharada ) ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. నవంబర్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు సందర్శకులకు ఈ ఎక్స్పో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
చేనేత కార్మికులకు ప్రోత్సాహమే లక్ష్యం
చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతి కల్పించడం, చేనేత దుస్తులపై ప్రజలలో అవగాహన పెంపొందించడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. నేత కార్మికులకు నిరంతర పని ఉపాధి కల్పించడంతో పాటు, వారు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఒకే చోట వివిధ రాష్ట్రాల ప్రత్యేక వస్త్రాలు
ఈ ప్రదర్శనలో గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం తదితర ప్రసిద్ధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్‌తో పాటు కరీంనగర్ బెడ్షీట్లు, బెడ్డింగ్స్, టవల్స్ వంటి వివిధ రకాల నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 60 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి.
వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలందరూ ఈ ప్రదర్శనను సందర్శించి, వివిధ రాష్ట్రాల నాణ్యమైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏడీ హ్యాండ్లూమ్ శ్రీకాంత్ రెడ్డి, వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డిసిఓ నీరజ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఫిషరీస్ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.