జర్నలిస్టుల హక్కుల పోరాటంలో వెనకడుగు వేయం

18-10-2026 | 05:23pm

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం(Telangana State Working Journalists Union) (టీయూడబ్ల్యూజే-ఐజేయు)(TUWJ-IJU) జిల్లా మూడో మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన అబ్దుల్ రహమాన్‌కు(Abdul Rahman) జర్నలిస్టు వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో(TUWJ Office) తెలంగాణ రాష్ట్ర ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజేఎఫ్) బృందం అబ్దుల్ రహమాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సందర్భంగా టీయూడబ్ల్యూజేఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీద్ ఇక్బాల్, కార్యదర్శిగా ఎన్నికైన నసిర్ ఖాన్‌లను టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సంక్షేమం కోసం అబ్దుల్ రహమాన్ చేస్తున్న నిరంతర కృషి అభినందనీయం. ఆయన గతంలో అందించిన సేవలను గుర్తించే మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జర్నలిస్టులందరికీ గర్వకారణం అని కొనియాడారు.

అనంతరం అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జర్నలిస్టుల హక్కుల పోరాటంలో వెనకడుగు వేయకుండా, వారి సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకుని మరింత అంకితభావంతో పనిచేస్తాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ముఫ్ఫఖం అహ్మద్, వసీ ఖాన్, అజర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు