గణేష్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ఒకే రకమైన చీరల్లో మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణ
డీజే, లైటింగ్ దాతలు రేణుక–మారుతి చౌహాన్ దంపతులకు ఘన సన్మానం
నాగల్గిద్ద, అక్టోబర్ 18 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండలంలోని(Nagalgidda Mandal) కరస్గుత్తి గ్రామ గణేష్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సంబరాలను(Celebrations of Saddula Bathukamma) ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాలనీ మహిళలందరూ ఒకే రకమైన చీరలు(Sarees) ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలతో సందడి చేశారు. మహిళల ఆటపాటలు, కోలాటాలు, డీజే సంగీతం, విద్యుత్ దీపాల అలంకరణలతో కాలనీ మొత్తం పండుగ శోభను సంతరించుకుంది.
ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాల నిర్వహణకు రేణుక–మారుతి చౌహాన్ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి డీజే, లైటింగ్ ఏర్పాట్లకు సహకరించారు. ఈ సందర్భంగా వారి సేవలను అభినందిస్తూ గణేష్ కాలనీ ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో ముందుంటూ పండుగల నిర్వహణకు సహకరించడం అభినందనీయమని కాలనీవాసులు పేర్కొన్నారు.
రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.