తెలంగాణ అమరవీరుల స్మారక టోర్నీ ప్రారంభం
బెజ్జూర్ అక్టోబర్ 17 (విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారకార్థం బెజ్జూర్ మండల్(Bejjur Mandal) ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ(Premier League Cricket Tournament) ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా తెలంగాణ జావిద్ మాట్లాడుతూ... తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ వారి పేరిట క్రీడా టోర్నీ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇది యువతలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని నింపుతుందని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు కొండ్ర జగ్గా గౌడ్ మాట్లాడుతూ... క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్నే కాకుండా మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. బెజ్జూర్ ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ మాట్లాడుతూ... క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి ఉంటేనే విజయం సాధ్యమవుతుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. బిజెపి నాయకులు సామల తిరుపతి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, సరైన వేదిక లేక వెనుకబడుతున్నారన్నారు.
ఇలాంటి మండల్ స్థాయి టోర్నీలు వారి ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ ఫర్టిలైజర్స్ ప్రొప్రైటర్ కవ్వాల సాయి, కాంగ్రెస్ నాయకులు,మండల అధ్యక్షులు శ్రీవర్ధన్,బీఆర్ఎస్ నాయకులు బూస సారయ్య, అమీరుద్దీన్, నిర్వాహకులు సురేష్ గౌడ్, వైకుంఠం, కాజా శంషుద్దీన్ (బాబు) తదితరులు పాల్గొన్నారు.