కాంగ్రెస్ అసమర్ధ పాలనతోనే కరెంట్ కోతలు
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షేట్టిపేట, అక్టోబర్ 17(విజయక్రాంతి) కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) అసమర్ధ పాలనతోనే రాష్ట్రంలో కరెంట్ కోతలు(Power cuts) ప్రారంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) విమర్శించారు. శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేట పట్టణంలోని పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కాగడాలతో నిరసన తెలిపి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ కోతలు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతున్నాయని మండిపడ్డారు.
రైతుల పంటలకు విద్యుత్ సరఫరా(Electricity supply) లేకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం రైతులను వరి పండించవద్దని చెప్పడం సిగ్గు చేటన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేస్తే నేటి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలు ప్రభుత్వం పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సాగునీటి విషయంలో ప్రగాల్భాలు గతంలో పలికి నేడు రైతులకు పంటలు వేయవద్దని చెప్పడం ద్వంద నీతికి నిదర్శనమన్నారు. కరెంట్ మోటార్లు కాలిపోతుంటే ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. వెంటనే రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ కాగడాల ర్యాలీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య,కౌన్సిలర్స్ మైలారపు సుధాకర్, పెట్టెం తిరుపతి,యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్,మాజీ సర్పంచ్ గోళ్ళ రవీందర్ నాయకులు మారిశెట్టి సుమన్,గోళ్ళ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.