బతుకమ్మ వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి): జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(District Rural Development Agency) ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) కన్నులపండుగగా వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA and BJP leader Maheshwar Reddy) పూజలు చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పూలను పూజించే గొప్ప సంస్కృతి మనదని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ పండుగను భక్తితో జరుపుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భక్తిశ్రద్ధలతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు.
బతుకమ్మకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిడబ్ల్యుఓ వినూత్న, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.