రైల్వే అండర్ బ్రిడ్జ్ ‘వై’ ఆకారంలో నిర్మించాలి
కేసముద్రం: కాజీపేట డోర్నకల్ రైల్వే సెక్షన్లో ఇంటికన్నె స్టేషన్(Intikanna Station) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జిని(Railway underbridge) ‘వై’ ఆకారంలో నిర్మించాలని గ్రామానికి చెందిన రైతులు సోమవారం బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైల్వే ట్రాక్ అవతల వైపు తమకు పంట పొలాలు ఉన్నాయని, ప్రతిరోజు పశువులు ఎడ్ల పనులు ద్వారా వ్యవసాయ భూముల వద్దకు రైల్వే గేట్ ఉన్నప్పుడు సులువుగా వెళ్లే వారమని చెప్పారు.
ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఒకవైపు మాత్రమే వెళ్లే విధంగా ఉందని, దీనితో తాము సుదూరం వెళ్లి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాకాకుండా ‘వై’ ఆకారంలో నిర్మిస్తే బ్రిడ్జి ఆవలి వైపు ఇరువైపులా సులువుగా వెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అధికారులు స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జిని ‘వై’ ఆకారంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.