కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి(government hospital)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పే స్లిప్లు, యూనిఫామ్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడం సరికాదన్నారు.
పెండింగ్ వేతనాలు(Pending Wages) చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, ప్రతి నెలా పే స్లిప్లు, నాణ్యమైన యూనిఫామ్లు అందించాలని కోరారు. కార్మికుల సమస్యలను పట్టించుకోని భీం ఏజెన్సీని తొలగించి కొత్త ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని, సూపరింటెండెంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపెళ్లి దివాకర్ గౌడ్, కార్యదర్శి భోగే ఉపేందర్, యూనియన్ నాయకులు నీల, మమత, గంగాధర్, సితార్ బేగ్, జ్ఞానేశ్వర్, రాధా, తిరుపతి, నరేందర్, సువర్ణ, అమృత, వాణి, ప్రమీల, మాధవి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చారి ధర్నాకు మద్దతు తెలిపారు.