లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్నగర్,(విజయ క్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ రైలు వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ప్రజలను కోరారు. సోమవారం సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ఆవరణ కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు , సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈనెల 21వ తేదీ వరకు ఉచిత కంటి పరీక్షలు, ప్లాస్టిక్ సర్జరీకి, స్త్రీలకు సంబంధించిన వైద్య పరీక్షలు , స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు.
అలాగే ఈనెల 22 నుండి 27 వ తేదీ వరకు చెవికి సంబంధించిన పరీక్షలు చేస్తారని అన్నారు. అలాగే ఈనెల 26 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 1 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు డెంటల్ పరీక్షలు నిర్వహించబడతాయ పేర్కొన్నారు. రోగులకు పరీక్షలు సందర్భంగా వచ్చిన రిపోర్టు ఆధారంగా వారికి ఆపరేషన్ నిర్వహించబడతా యని వివరించారు. వైద్య శిబిరాలకు వచ్చిన రోగులకు, వారి బంధువులకు ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు వివరించారు.