వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి శిథిలాల ముప్పు

19-10-2026 | 09:03pm

పెచ్చులూడుతున్న పై కప్పు

ప్రమాదం అంచున విధులు

నూతన భవనం ఎప్పుడో.. ఎదురుచూపుల్లో అధికారులు

కోదాడ,(విజయక్రాంతి): పట్టణంలోని వ్యవసాయ మార్కెట్(Kodada Agricultural Market) కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. భవనం పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

కార్యాలయ పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. నిత్యం అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు సైతం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. భవనం పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు.

నూతన భవనం కోసం ఎదురుచూపులు

వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు ఎప్పుడు చేపడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత భవనం పరిస్థితి చూస్తుంటే మరమ్మతులతో సరిపెడతారా లేక నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుడతారా అన్న చర్చ సాగుతోంది.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి, భవనాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతన భవనం నిర్మాణం ఎప్పుడు చేపడతారోనని అధికారులు, సిబ్బంది ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు