ఆయిల్‌పామ్ సాగు.. ఆదాయానికి బాట
కాగజ్‌నగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. అరెగూడలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న 16 మంది, కపాస్ క్రాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగు చేస్తున్న ఐదుగురు రైతులను సన్మానించారు. అనంతరం ఆయిల్‌పామ్ గెలల కొనుగోళ్లను ప్రారంభించారు.
యాసంగిలో మొక్కజొన్న, జొన్న, పెసర, పుచ్చకాయలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 1,750 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, ఈ ఏడాది మరో 1,000 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి రూ.లక్ష, ఎనిమిదో సంవత్సరం నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్(Oil Palm) సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమంకర్ పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి డా. వెంకటి, ఏడీఏ మనోహర్, ఏఓ రామకృష్ణ, శాస్త్రవేత్త డా. మధుబాబు, ఉద్యానవన శాఖ అధికారి నదీమ్, సుప్రియ, ఎస్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Officials) రైతులకు సాగు విధానాలు, మార్కెటింగ్(Marketing) అంశాలపై అవగాహన కల్పించారు.