లంబడిగూడలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలం(Bejjur Mandal)లోని లంబడిగూడ గ్రామంలో కౌటాల సీఐ సంతోష్ కుమార్(Koutala CI Santosh Kumar) ఆధ్వర్యంలో బెజ్జూర్ ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నీతికా పంత్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, నాటుసారా తయారీ, అక్రమ కార్యకలాపాలపై తనిఖీలు చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24/7 పోలీసు పహారా కొనసాగిస్తామన్నారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి, గుడుంబా తయారు చేసే సామాగ్రి స్వాధీన పరుచుకున్నారు.
గ్రామస్తులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు పోలీసుల చర్యలను అభినందిస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహించాలని కోరారు. ఈ కార్డన్ సెర్చ్ లో బెజ్జూర్ ఎస్సై రమేష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక పోలీస్ గస్తీ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.