అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి సీతక్క
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
ములుగు, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అర్నబ్ తుఫాన్(Arnab Cyclone) ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క(Minister Seethakka) అప్రమత్తం చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన సూచనలు అందిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.