శ్రీవారి రూపానికి ప్రాణం పోసిన కళాకారుడు ఇకలేరు

14-11-2026 | 08:42am

ప్రతి ఇంట్లో పూజలందుకునే తిరుమల శ్రీవారి చిత్రాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కళారంగంతో పాటు శ్రీవారి భక్తుల్లో విషాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు చదువుకుని, ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద Paintingలో శిక్షణ పొందారు. ఆయన కళాప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 1970లో ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా గర్భగుడిలోని మూలవిరాట్టును ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామివారి దివ్యమంగళ రూపాన్ని తన కుంచెతో అద్భుతంగా ఆవిష్కరించారు.

శ్రీవారు సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపంతో పాటు ఆభరణాలు లేని నిరాడంబర రూపాన్ని కూడా ఆయన చిత్రించారు. ఈ రెండు చిత్రాలు భక్తుల్లో విశేష ఆదరణ పొందాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అనేక ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో పూజలందుకుంటున్న వేంకటేశ్వరస్వామి చిత్రం ఆయన కళా సృష్టే. తన ప్రత్యేకమైన Artistic Styleతో శ్రీవారి రూపాన్ని కోట్లాది మంది భక్తులకు చేరువ చేశారు. ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కోవిల్పట్టిలోని ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు, స్థానికులు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. తన కుంచెతో శ్రీవారి దివ్యరూపాన్ని తరతరాల భక్తుల హృదయాల్లో నిలిపిన శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గీసిన చిత్రం మాత్రం భక్తుల ఇళ్లలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోనుంది.

మరిన్ని వార్తలు