విశ్వవేదికపై ‘తెలంగాణ రైజింగ్’
- అట్టహాసంగా ‘భారత్ సమ్మిట్’ ప్రారంభం
- ‘ఎ న్యూ వరల్డ్’ నినాదంతో శ్రీకారం
- 70 దేశాల నుంచి వెయ్యికి పైగా ప్రతినిధుల రాక
- సదస్సును ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
- సల్మాన్ ఖుర్షీద్ ప్రారంభోపన్యాసం
- పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి శ్రీధర్‌బాబు భేటీలు
- సామాజిక న్యాయం, సంక్షేమంపై మంత్రుల మేధోమథనం
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఖండాలు దాటి వచ్చిన అతిరథ మహారథుల కోలాహలం.. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటే అరుదైన ఫొటో ప్రదర్శనలు.. కళ్లు మిరుమిట్లు గొలిపే అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లతో భాగ్యనగరం సరికొత్త కళను సంతరించుకుంది. 70కి పైగా దేశాల నుంచి తరలివచ్చిన వెయ్యి మందికి పైగా విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజులతో హైదరాబాద్ నగరం మినీ ప్రపంచాన్ని తలపించింది.
ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రగతిశీల విధా నాల రూపకల్పన లక్ష్యంగా భాగ్యనగరంలోని హెచ్ఐసీసీ వేదికగా రెండో అంతర్జా తీయ సదస్సు ‘భారత్ సమ్మిట్(Bharat Summit)- శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత స్వాతంత్య్రం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్క రించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ‘ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ (కొత్త ప్రపంచ నిర్మాణం) అనే ప్రధాన ఇతివృత్తంతో సదస్సుకు శ్రీకారం చుట్టారు.
భారత దౌత్య వారసత్వానికి ఫొటో ప్రదర్శన
భారత్‌కు వివిధ దేశాలతో ఉన్న దశాబ్దాల నాటి దౌత్య సంబంధాలను తెలియ జేసే ’ఇండియా అండ్ ది వరల్ ఎక్స్ఫో’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలి సి ప్రారంభించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భారత ప్రధానులు అంతర్జాతీయస్థాయిలో సాధించిన దౌత్య విజయాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పుస్తక ప్రదర్శనను తిలకించారు.
అలాగే ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్.. ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని ఆవిష్క రించి పరిశీలించారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రారం భోపన్యాసం చేశారు. గ్లోబల్ సౌత్--గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సహకారం, ప్రజాస్వామ్యానికి ఎదరవుతున్న సవాళ్లపై ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం హెచ్ఐసీసీ వేదికగా ఏడు అంతర్జాతీయ ప్యానెల్ చర్చ లు, హైటెక్స్ వేదికగా నాలుగు ‘తెలంగాణ రైజింగ్’ ప్రత్యేక చర్చా గోష్ఠులు జరిగాయి.
సామాజిక న్యాయం, సంక్షేమంపై మథనం
భవిష్యత్ నగర నిర్మాణం (ఫ్యూచర్ సిటీ), పట్టణీకరణ, రాష్ట్ర అభివృద్ధి నమూనాపై జరిగిన ప్రత్యేక ప్యానెల్ చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ ప్రజాప్ర భుత్వ ప్రాధాన్యతలను వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతినిధులకు వివరించారు.
మంత్రి శ్రీధర్‌బాబు అంతర్జాతీయ భేటీలు
ఈ అంతర్జాతీయ వేదికను తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడానికి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంది. అమెరికా, కెనడా, టర్కీ, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, కంపెనీల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, టెలికాం, అర్బన్ మొబిలిటీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు.
సాయంత్రం జరిగిన ప్రత్యేక ఇంటరాక్టివ్ ప్లీనరీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొని అంతర్జాతీయ మేధావులతో ముఖాముఖి చర్చించారు. కాగా, శనివారం జరిగే సదస్సు ముగింపు వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.