ట్రక్ పార్కు భూమి వేలం వేయొద్దు
- భూములు కొన్నా అనుమతులు ఇవ్వం
- వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మళ్లీ వెనక్కి తీసుకుంటాం
- ప్రజా అవసరాలకే వినియోగిస్తాం
- హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పును పాటించాలి
- లేదంటే హెచ్ఎండీఏ అధికారులకు శిక్ష తప్పదు
- సీఎం కుర్చీతో రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ దందా
- ఆయన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడి ఉరేసుకుంటుంది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- బీఆర్ఎస్ నేతలతో కలిసి కూకట్పల్లి ట్రక్ పార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్/కూకట్పల్లి, నవంబర్ 13 (విజయక్రాంతి): ‘కూకట్పల్లి ట్రక్ పార్క్ స్థల భూములను ప్రభుత్వం వేలం వేయుద్దు. ఈ వేలంలో పాల్గొనేవారికి కూడా స్పష్టంగా చెప్తున్నా.. బిడ్డా జాగ్రత్త.. వేలంలో పాల్గొని భూములు కొన్నా అనుమతులు ఇవ్వం. రేపు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ భూమిని వెనక్కి తీసుకుని ప్రజా ప్రయోజనాలకే వాడుతాం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) హెచ్చరించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ట్రక్ పార్క్ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హరీశ్‌రావు ధర్నా చేశారు.
స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను అమ్మకానికి పెడితే.. నాడు ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు, సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు, ఎంపీ వినోద్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులందరం కలిసి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేశామని, ఉమ్మడి పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ భూమిని కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ భూమిని అమ్మకానికి పెట్టడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు.
సర్వే నంబర్ 155లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, 156లో ఉన్న ట్రక్ పార్కింగ్, హెచ్ఎండీఏ నర్సరీ, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జాగాను కూడా అమ్మేస్తామనడం దుర్మార్గమన్నారు. రేవంత్‌రెడ్డి ఇంకేమీ మిగిల్చే పరిస్థితి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పక్కనే ఉన్న ఇండియన్ కంటైనర్ డిపో నుంచి రోజుకు 500 కంటైనర్లు లోడ్ అయి ఎక్స్పోర్ట్ అవుతుంటాయని, సిటీలోకి లారీలకు కేవలం 4 గంటలే ఎంట్రీ ఉండే కారణంగా ట్రక్కులు ఇక్కడ పార్క్ చేసుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటారని, ఈ స్థలాన్ని అమ్మేస్తే ఆ వందలాది లారీలు, కంటైనర్లు ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపూ భూముల చుట్టే తిరుగుతున్నాడని, ఏడ భూమి కనబడితే ఆడ అమ్ముడే పనిగా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. చివరకు కాప్రాలో 484 గజాలు, అమీన్పూర్లో 302 గజాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టారంటే ఎంత సిగ్గుచేటు అన్నారు. 50 గజాలు, 100 గజాలు, 300 గజాలు కూడా వదలకుండా సీఎం కుర్చీలో కూర్చుని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని ఆరోపించారు. భూముల వేలంపై రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడి ఉరేసుకుంటుదేమోనని ఎద్దేవా చేశారు.
సీపీఐ, సీపీఎంతో కలిసి పోరాడుతాం
భూముల రక్షణ కోసం బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంతవరకైనా పోరాడి, అవసరమైతే న్యాయస్థానాల్లో కొట్లాడి ఈ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, కోల్ స్కామ్ తప్ప పరిపాలన లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏకంగా రూ. లక్ష కోట్ల భూములను అమ్మకానికి పెట్టారని, ఇప్పటికే రూ. 26 వేల కోట్ల భూములు అమ్మేశారని ఆరోపించారు. ‘ఎవడి జాగీరు అని ఈ భూములు అమ్ముతున్నావ్ రేవంత్‌రెడి? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు’ అని ప్రశ్నించారు.
హిల్ట్ పాలసీ పేరుతో బాలానగర్, అజామాబాద్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఉన్న 9,900 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను కమిషన్ల కోసం అడ్డికి పావుసేరుకు రెగ్యులరైజ్ చేస్తూ పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని, ప్రత్యామ్నాయ పరిశ్రమలు పెట్టకుండా వాటిని రియల్ ఎస్టేట్‌గా మారిస్తే అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికుల ఉద్యోగ భద్రత ఏం కావాలని నిలదీశారు.
మరోవైపు 22- ఏ నిషేధిత జాబితా తీసేశామని రోజుకో డైలాగ్ కొడుతున్నారు గానీ, నేటికీ యూఎల్సీ భూముల్లో, కాలనీలు, అపార్ట్మెంట్లలో రిజిస్ట్రేషన్లు కావడం లేదని, అధికారులు లంచాలు, కమిషన్ల కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో కరువు ప్రభావం ఒక్క ఏడాదే ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టేస్తోందన్నారు.
హైడ్రా, 22-ఏ పేరుతో పేదల బతుకులను కూల్చేస్తున్న ఈ ప్రభుత్వమే ప్రజల పాలిట ఒక వైపరీత్యంగా మారిందన్నారు. ఒకవైపు కరువు, కరెంట్ కోతలు ఉంటే.. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్ల పేరుతో వందల కోట్లు తగలేస్తూ గోబెల్స్ ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎంపీగా కూకట్‌పల్లికి ఏమీ చేయలేకపోయాను.. సీఎంగా కూకట్‌పల్లిని ఉద్ధరిస్తానని రేవంత్ రెడ్డి గతంలో డైలాగ్ కొట్టాడని, హౌసింగ్ బోర్డు భూములు, ట్రక్ పార్కింగ్ భూములు, పార్కులు, క్యాంప్ ఆఫీసులు, పెట్రోల్ పంపులు, బొందల గడ్డలు.. ఇలా గజం జాగా లేకుండా అమ్ముకోవడమే కూకట్‌పల్లిని ఉద్ధరించడమా అని ప్రశ్నించారు.
‘నీ అధికారం శాశ్వతం కాదు.. నాడు ఉద్యమంలో పాల్గొనక తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డావు, నేడు ప్రజల భూములు అమ్మితే రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతావు, భేషజాలకు పోవద్దు’ అని హితవు పలికారు. తక్షణమే కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. మూసాపేట ట్రక్ పార్క్ భూములను కేవలం ప్రజా అవసరాల కోసమే వినియోగించాలని, వాణిజ్య అవసరాలకు లేదా ఇతర షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు లేదా ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని, హెచ్‌సీయూ భూములు తనఖా పెట్టి రూ.500 కోట్ల లంచంలో ముంబై స్టాక్ ఎక్సేంజిలో రూ.20 వేల కోట్ల లోన్ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను విక్రయించడం ద్వారా భవిష్యత్తు తరాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి ప్రాంత జనాభా సుమారు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మితమాయ్యాయని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా క్రీడా మైదానాలు, పార్కు స్థలాలు, ఇతర మౌలిక అవసరాలకు ప్రభుత్వ స్థలాలు అవసరం అన్నారు.
భూముల వేలాన్ని రద్దు చేయాలి
ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇంచు భూమి కూడా అమ్మబోమని పీసీసీ అధ్యక్షుడి హోదాలో వాగ్దానం చేసిన రేవంత్‌రెడ్డి.. ఇవాళ ఇంచు భూమి కూడా మిగల్చకుండా అమ్ముతున్నారని మండిపడ్డారు. హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూములు, టీజీఐఐసీ భూములు, హెచ్ఎండీఏ భూములు, కుడా భూములు, దళిత గిరిజనుల అసైన్డ్ భూములు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఉర్దూ యూనివర్సిటీ భూములు, ఇండస్ట్రియల్ భూములు, హెరిటేజ్ భూములు, ఎన్విరాన్మెంటల్ భూము రాత్రికి రాత్రే ప్రైవేట్ ఆస్తులుగా మార్చి అమ్మేస్తూ.. అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా రేవంత్ రెడ్డి మారిపోయాడని ఎద్దేవా చేశారు.
కూకట్పల్లి భూమిని ట్రక్ పార్కింగ్, ప్రజా ప్రయోజనాల కోసమే వాడుతామని ఇదే అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారని, మరి హెచ్ఎండీఏ చట్టానికి విరుద్ధంగా ఎకరం రూ.100 కోట్లకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లకు విరుద్ధంగా ఈ భూములు అమ్మితే చట్టరీత్యా చెల్లదని, హెచ్ఎండీఏ అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఈ భూమిని కొంటే నష్టపోతారు కాబట్టి ఎవరూ వేలంలో పాల్గొనవద్దని సూచించారు.