ప్రతి కుటుంబానికి బీమా
- కుటుంబ పోషకుడు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక భరోసా
- 19 నుంచి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ నమోదు
- డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ జీవిత బీమా కల్పించే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేయనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. గతంలో బీమా పథకాలు కొన్ని వర్గాలకే పరిమితం కాగా, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ రక్షణ కల్పించనున్నట్లు భట్టి వెల్లడించారు.
కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల కు పథకంపై ఆయన దిశానిర్దేశం చేశారు. దేశంలోనే ఈ తరహా పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందన్నారు. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జమైన సార్వత్రిక జీవిత బీమా స్కీం అని పేర్కొన్నారు.
ఈ పథకాన్ని కేవలం బీమాకే పరిమితం చేయకుండా, కుటుంబాలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు భట్టి వివరించారు. ప్రతి కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తికి మాత్రమే బీమా వర్తిస్తుందని, ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధి పొందితే వారిలో ఎవరికి బీమా సౌకర్యం కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలని తెలిపారు. అలాగే ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని, బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చన్నారు. ఈ పథకాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
కుటుంబసభ్యుల అంగీకారం..
లబ్ధిదారుల నమోదులో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని భట్టి సూచించారు. బీమా పొందే వ్యక్తి పేరు, నామినీల వివరాలు సహా అన్నీ కచ్చితంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించాలని, వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో గ్రామాల్లో టామ్‌టామ్ వేయించాలని సూచించారు.