‘ఆకలికి సెలవు.. చదువుకు వెలుగు’.!
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం
- కేసముద్రం మార్కెట్లో ఆధునిక కిచెన్ షెడ్ ఏర్పాటు
- ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు సన్నాహాలు
మహబూబాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం’(Chief Minister's Breakfast Scheme) అమలులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆధునిక కిచెన్ షెడ్ ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థులకు పోషకాహారం అందించి, వారు ఆకలితో తరగతి గదులకు రాకుండా చూడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో కొందరు అల్పాహారం తీసుకోకుండానే తరగతి గదులకు చేరుకుంటున్నారు. దీంతో వారి ఆరోగ్యం, చదువుపై దృష్టి ప్రభావితమయ్యే అవకాశముంది.
ఈ నేపథ్యంలో పాఠశాలల్లోనే అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. విద్యార్థులకు సమయానికి ఆహారం అందించేందుకు అవసరమైన వంట సదుపాయాల కల్పనలో భాగంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కిచెన్ షెడ్ నిర్మాణం చేపడుతున్నారు. హరే కృష్ణ మూమెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, రూపొందుతున్న ఆధునిక వంటశాల అందుబాటులోకి వస్తే ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియలను క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది.
అయితే వంటశాల నిర్వహణలో పరిశుభ్రత, నాణ్యమైన ముడిసరుకుల వినియోగం, పోషక విలువలతో కూడిన మెనూ, విద్యార్థులకు నిర్ణీత సమయంలో అల్పాహారం అందించడం కీలకం కానున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల తో పాటు సరిహద్దు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇక్కడినుండే బ్రేక్ఫాస్ట్ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
30,000 మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 45 వాహనాల్లో 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు కేసముద్రం అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ నుండి అల్పాహారం తయారుచేసి పంపిస్తారు. ఇందుకోసం ఆధునిక యంత్ర పరికరాలను తెప్పించారు. అత్యధిక బాయిలర్లు, ఆర్ఓ ప్లాంట్, స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు, నాణ్యతతో కూడిన వివిధ రకాల అల్పాహారం,
సాంబార్, చట్నీ, కూరల తయారీకి ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఉన్న పెద్ద గోడౌన్ ను సెంట్రలైజ్ కిచెన్ షెడ్ గా మార్చే పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
‘వేం’కృషితో ఏర్పాటు
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కేసముద్రం మండల ప్రాంతవాసి కావడంతో ఆయన ప్రత్యేక కృషితో కేసముద్రం పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత ఏర్పాటు చేయడానికి కూడా వేం నరేందర్ రెడ్డి కృషి ఎంతో ఉంది.
ఇప్పటికే కేసముద్రం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఆయన ప్రత్యేక చొరవ చూపి సెంట్రలైజ్డ్ కిచెన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఫలితంగా సెంట్రలైజ్డ్ కిచెన్ సెంటర్కు కేసముద్రం వేదికగా మారింది. భవిష్యత్తులో ఇక్కడి నుండే మధ్యాహ్నం భోజనం కూడా వండి పెట్టే అవకాశాలు ఉన్నాయి.