ఇబ్బందులకు గురిచేయొద్దు.. రైస్ మిల్లర్ల నిరసన
ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ల నిరసన
మహబూబాబాద్, (విజయక్రాంతి): రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురిచేయొద్దని, సీఎంఆర్ రైస్(CM-R Rice) వ్యవహారంలో ఎదురవుతున్న కష్ట నష్టాలను సమీక్షించాలని, కేసులు, అరెస్టులతో మానసికంగా కుంగిపోతున్నారని, ప్రభుత్వం తక్షణం ఈ అంశాన్ని పరిశీలించాలని రైస్ మిల్లర్లు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) వ్యాప్తంగా రైస్ మిల్లర్లు హనుమకొండ ఏకశిలా పార్కులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. 2025-26 సంవత్సరానికి సీఎంఆర్ కోట కింద ఇచ్చిన ధాన్యంలో బియ్యం పడితే అధికంగా నూక అవుతోందని, ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
షార్ట్ ఫాల్ వేధింపులు మానుకోవాలని, రన్నింగ్ మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. టెండర్ ప్యాడీ ధర(Tender paddy price) తగ్గించడంతోపాటు వడ్డీ, పెనాల్టీలు రద్దు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక రైస్ మిల్లుల బంద్(Rice mills shutdown) కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం నాయకులు గోనెల రవీందర్, తోట సంపత్ కుమార్, బాదం ప్రవీణ్, పెద్ది వెంకట నారాయణ, అంజయ్య,ఓలం కృష్ణమూర్తి, చిదురాల శ్రీనివాస్, పెద్ది ప్రవీణ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.