విమోచనం ఎందుకు జరపరు?

12-09-2026 | 04:05am

ఎంఐఎం భయంతోనే వెనుకడుగు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

బీజేపీ వస్తే అధికారికంగా నిర్వహిస్తాం

ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ సంస్థాన పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో సెప్టెంబర్ 17ను అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచనదినంగా నిర్వహిస్తుండగా, తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్(BJP MP Dr K Laxman) ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎంకు భయపడి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని, కాలగర్భంలో తొక్కిపెట్టాయని ఆరోపించారు. కాసీం రజ్వి వారసత్వం గా కొనసాగుతున్న ఎంఐఎం, దారుస్పలాం ఆదేశాలకు భయపడే పరిస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రోశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేసీఆర్, ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు అధికారంలోకి వచ్చాక తన వైఖరి మార్చుకున్నారని విమర్శించారు.

అసెంబ్లీలో తాను ప్రస్తావించినా జరిపే ప్రసక్తే లేదని మడమతిప్పారని ఆరోపించారు. ‘కారు ప్రభుత్వం నడిపితే, స్టీరింగ్ నా చేతుల్లో ఉంది’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్న మాటలను గుర్తు చేస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం మజ్లిస్‌కు తొత్తుగా వ్యవహరించిందని మండిపడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సైతం అదే బాటలో నడుస్తూ ‘ప్రజాపాలన’ పేరిట వి మోచన దినోత్సవ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. నాడు నిజాం, రజాకార్ల తరహాలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల భూములను 22ఏ జాబితాలో చేర్చి కబ్జాలకు అవకాశం కల్పిస్తుందని..  చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలు మళ్లీ పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

అమిత్ షా పర్యవేక్షణలో 2022 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా విమో చన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూ డా ఘనంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు అధికారికంగా విమోచనదినం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. నేటి యువతరానికి, జెన్-జీ, జెన్-ఆల్ఫా తరాలకు దేశానికి స్వాతంత్య్రం ఆగస్టు 15న వచ్చిందన్న విష యం మాత్రమే తెలుసన్నారు. నాడు తెలంగాణలోని పరిస్థితులను చాలామంది గ్రహిం చలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చరిత్రను వెలుగులోకి తెస్తాం: బూర నర్సయ్యగౌడ్

తెలంగాణ విమోచనకు సంబంధించిన చారిత్రక సత్యాన్ని వెలుగులోకి తెస్తామని, బీజేపీ తెలంగాణ విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే విస్తృతంగా  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజే స్తున్నామని, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కూడా కలుస్తామని చెప్పారు. శనివా రం (నేడు)  బాలాపూర్ నుంచి చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం వరకు తిరంగా ర్యాలీ, అబిడ్స్‌లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘తెలంగాణ విమోచనంలో జాతీయవాదుల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

15న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి నేతత్వంలో భాగ్యలక్ష్మి ఆలయం నుంచి అసెంబ్లీ సర్దార్ పటేల్ విగ్రహం వర కు ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’, 16న ఉద యం 10 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌లో చారిత్రక ఎగ్జిబిషన్, అదేరోజు చారిత్రక వాస్త వాలపై ‘మాక్ అసెంబ్లీ’ ఉంటుందన్నారు. 7న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారని వివరించారు. కవాతు, సాంస్కతిక  ప్రదర్శనలు, అమరవీరుల కుటుంబాలకు సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరులకు నివాళులర్పించాలని  పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు