ఏళ్లుగా ఎదురుచూపులే?

12-09-2026 | 05:05am

నాలుగేళ్లైనా పూర్తవ్వని రెడ్డిపల్లి బల్సుర్గొండ రోడ్ 

ఇండ్ల చుట్టూ చేరుతున్న డ్రైనేజీ నీరు

ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని కాంట్రాక్టర్

గండీడ్ సెప్టెంబర్ 11: వెనుకబడిన మండలాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో రూర్బన్ ప్రాజెక్టు కింద ఉమ్మడి గండీడ్ మండలానికి రూ 100 కోట్లు మంజూరు చేసిన విషయం విధితమే. ఈ నిధుల ప్రకటన చూసి నాడు ఉమ్మడి మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు ఇక మా మండలం, మా గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని ఆశించారు.

కాగా వారి ఆశలు ఆశించిన మేరకు అడుగులు పడలేదని తెలుస్తుంది. రెడ్డిపల్లి గేటు నుంచి మన్సుర్ పల్లి, కొండాపూర్ మీదుగా బల్సూర్ గొండ గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్లు బీటి రోడ్డు నిర్మించేందుకు 2021 ఏడాదిలో సెప్టెంబర్ 21 నాడు అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), అప్పటి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(Koppula Mahesh Reddy) రూ 3 కోట్ల కోట్ల 71 లక్షల 60 వేల నిధులతో నూతన బీటీ రోడ్డు కు శంకుస్థాపన చేశారు.

ఇక్కడ వరకు సంబురంగా శంకుస్థాపన కార్యక్రమం పూర్తయినప్పటికీ ఆ రోడ్డు వేసినప్పటికీ నాసిరకంగా వేయడంతో ప్రత్యేక నిధులు కావడంతో రాష్ట్ర ఉన్నత అధికారులు ఈ రోడ్డు పలు మార్లు పరిశీలన చేసి పూర్తిగా నాసిరకంగా ఉందని తేల్చారు. దీంతో తిరిగి రోడ్డు నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఉన్న రోడ్డు పూర్తిగా కంకర తెలి గుంతల మయంఅయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నానా అవస్థలు పడుతున్నామని వారు చెబుతున్న మాట.

పాత రోడ్డే అద్భుతం.... కొత్త రోడ్డు నాసిరకం

 అసలు పాత రోడ్డు తీసి కొత్త రోడ్డు ఎవరేమన్నారు.. పాత రోడ్డు అప్పుడు ఏ మహానుభావుడు వేశారో తెలియదు కానీ కొంచెం గట్టిగానే వేశారు. నిధులు కోట్లల్లో వచ్చాయని ఉన్న రోడ్డు తీసి కొత్త రోడ్డు వేశారు. ఆ వేసిన రోడ్డు మూడు నెలల ముచ్చటగా మారింది. గ్రామ పరిధిలో రోడ్డు ఇరువైపుల ఉన్న డ్రైనేజీలను కూల్చి రోడ్డు వేస్తామని చెప్పి ఏండ్ల తరబడి డ్రైనేజీకి దిక్కులేదు.. రోడ్డు మాటే లేదు.. డ్రైనేజీ మురుగునీరు ఇండ్ల చుట్టూ చేరుకుంటుంది.. ప్రజా ప్రతినిధులకు చెబుతుంటే అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లడిస్తున్నారు. మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలంటూ ఆయా గ్రామాల ప్రజలు కన్నీరు పెట్టుకుంటుండ్రు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ 

తీసుకోవాల్సిందే..

ఉన్న డ్రైనేజీలను కూల్చి రోడ్డు వేయకుండా నానా అవస్థలకు గురిచేసిన సంబంధిత కాంట్రాక్టర్ పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్న మాట. ఇప్పటికే పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్ కు ఫోన్ ద్వారా ఆదేశించినప్పటికీ వారు స్పందించలేదని తెలుస్తుంది. ఇకనైనా ఎలాగైనా తమ సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తుండ్రు. కాంట్రాక్టర్ స్పందించకుంటే చేయాల్సిన తదుపరి ప్రక్రియను పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతుండ్రు. 

రూర్బన్ నిధులు అయిపోయాయా..?

అభివృద్ధి చేయాలంటే నిధులు అతి ముఖ్యం. ఆ నిధులే అందుబాటులో ఉంటే మరి అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అర్థం కాని పరిస్థితి నెలకొంది. రూపం నిధులు ఇంతకు ఉన్నాయా లేదా అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అధికారులను ఈ నిధుల విషయం అడిగితే అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు..ఆ నిధుల సంగతి తేల్చడం లేదు. రూ 100 కోట్ల నిధులు సద్వినియోగం ఎక్కడెక్కడ జరిగింది...అసలు ఆ నిధులు ఉన్నాయా లేవా..అనే సందేహం మండల పరిధిలోని ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. నిధులు ఉంటే వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెనకబడిన మండలాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన బాధ్యతగా నిర్వహించాలని ప్రజలు కోరుతుండ్రు.



రోడ్డు వేస్తామని 

కూల్చిన్రు ఎవ్వరు వస్తలే..

 ఏండ్ల క్రితం రోడ్డు వేస్తాం ఉన్న డ్రైనేజీ కూల్చివేస్తాం అని చెప్పి కూల్చిన్రు. అప్పటినుండి ఇప్పటివరకు మురుగునీరు ఇండ్ల చుట్టూ చేరుకుంటుంది. అసలే మాది పాత ఇల్లు... పునాది పూర్తిగా నాన్తుంది.  మురుగు కాల్వ కట్టి రోడ్డు వేస్తే బాగుంటుంది. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు.

- గాజుల కొండమ్మ, 

రెడ్డి పల్లి గ్రామం 



 రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు...

చేసేటప్పుడు కాంట్రాక్టర్లు మంచిగా చేయరు. అధికారులు దగ్గర ఉండరు. చేసిన తర్వాత అది బాగా లేదని తేలింది అంట. పాత రోడ్డు బాగుండే.. అది పీకి ఇది వేసిండ్రు. అది లేదు ఇది లేదు... రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంది. మా గ్రామానికి బస్సు కూడా రాదు.. ఆటోలు బైకుల పైన వెళ్లాలి. ఉన్నా రోడ్డు కూడా బాగా లేకుంటే ఎట్లా. త్వరగా మంచిగా చేయాలి. 

- ఎదుల శంకరయ్య, 

మన్సూర్‌పల్లి గ్రామం 

ఎన్ని మార్లు చెప్పిన కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు..

 రోడ్డు విషయం పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్కు చెప్పినప్పటికీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లడిస్తున్నారు తప్ప అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికార దృష్టికి తీసుకుపోయి తదుపరి చర్యలు తీసుకుంటాం. 

- హలీం, ఏఈ, పంచాయతీరాజ్, గండీడ్ మండలం.

మరిన్ని వార్తలు