పెద్దతండలో 45 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం

27-10-2026 | 07:08pm

*గ్రామకంఠంగా ప్రకటించిన అధికారులు

*ఎమ్మెల్యేకు, సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు 

భూత్పూర్, అక్టోబర్ 27: భూత్పూర్ మండలం పెద్దతండ గ్రామపంచాయతీలో 45 ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ప్రధాన భూ సమస్య(Land Dispute)కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామంలోని సర్వేనెంబర్ 179, 180లో గల 3.02 గుంటల భూమిని 1982 సంవత్సరంలో అప్పటి పట్టాదారులు ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వానికి అమ్మారు. అయితే వారి వారసులు అది తమ సొంత పట్టా భూమిగా చెప్పుకుంటూ స్థానికులను తీవ్రంగా హింసించేవారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

ఈ విషయంపై స్థానిక సర్పంచ్ ఉడిత్యావత్ సుశీల రెడ్యానాయక్ స్పందించి దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు చర్యలు తీసుకోవడంతో అధికారులు సదరు భూమిని గ్రామకంఠంగా ప్రకటించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక అధికారుల కృషిని కూడా అభినందించారు. ఈ మేరకు మంగళవారం MPO శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారికంగా ప్రభుత్వ బోర్డును ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శి, గ్రామ అధ్యక్షుడు, యూత్ అధ్యక్షులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు