మార్కులే కాదు.. సమగ్ర అవగాహన ముఖ్యం
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల(government schools) విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ రెడీనెస్ ప్రోగ్రామ్’(Foundation of Future Readiness Program)ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(Collector Khushboo Gupta) శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జిల్లాలోని 26 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సంభాషణా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, సమస్యల పరిష్కారం, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ వృత్తి ప్రణాళికపై శిక్షణ అందించనున్నారు.
విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.