ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో(Telangana Armed Struggle) భూస్వామ్య గడీల అహంకారాన్ని ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. హక్కుల సాధన కోసం ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, శ్రీనివాస్ యాదవ్, మైత్రి యాదయ్య, రమేష్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.