మునగ ఆకు పొడి మరియు సోలార్ డ్రైయింగ్ యూనిట్లను పరిశీలించిన అధికారులు
జిల్లాలో మునగ సాగు విస్తరణకు, రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యం....
ఉట్నూర్, నవంబర్ 23 ( విజయక్రాంతి ): సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలలో మునగాకుతో తయారు చేసే పొడిని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి(District Horticulture Officer) సందీప్ కుమార్ తో పాటు అధికారులు సోమవారం పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశాల మేరకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ మరియు జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ జీసీసీ ఉట్నూర్ సీనియర్ మేనేజర్ ఆర్. సంతోష్ కుమార్ తో కలిసి సిరిసిల్ల మరియు సంగారెడ్డి జిల్లాలలో గల మునగ ఆకు పొడి తయారీ యూనిట్లు మరియు సోలార్ డ్రైయింగ్ యూనిట్లను సందర్శించారు.
ఈ సందర్శనలో భాగంగా వారు మునగ తోటలను, ఆకు పొడి తయారీ ప్రక్రియను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మునగ ఆకులను కోయడం నుండి శుభ్రపరచడం, సోలార్ డ్రైయర్ లో ఎండబెట్టడం, పొడిగా తయారుచేయడం, ప్యాకింగ్ చేయడం వరకు గల అన్ని దశల గురించి యూనిట్ల నిర్వాహకుల నుండి వివరంగా తెలుసుకున్నారు. యూనిట్ల నిర్వహణ, యంత్ర పరికరాలు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ విధానం, రైతులకు లభిస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్ మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కువ మంది రైతులు మునగ సాగు చేపట్టే విధంగా ప్రోత్సహించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మునగ కేవలం కాయల కోసమే కాకుండా ఆకుల కోసం కూడా సాగు చేస్తే రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
మునగ ఆకులకు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉందని, మునగ ఆకు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, దీనిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారని తెలిపారు. చిన్న తరహా విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా రైతులు ముడి ఉత్పత్తిని అమ్మడంతో పాటు, పొడిగా తయారుచేసి అమ్మడం ద్వారా 4 నుండి 5 రెట్లు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో మునగ సాగుకు అనుకూలమైన వాతావరణం, భూములు ఉన్నాయని, జీసీసీ మరియు ఉద్యానవన శాఖ సంయుక్తంగా రైతులకు శిక్షణ ఇచ్చి, సోలార్ డ్రైయింగ్ యూనిట్లు, చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తాయని తెలిపారు. దీని ద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.