ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
*మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు డిమాండ్..
ములకలపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పోడు సాగుదారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీ,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు(Former MP Midiam Baburao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా 3వ మహాసభలను నిర్వహించారు.
ముందుగా ఎస్బిఐ బ్యాంక్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మహాసభలను ప్రారంభించారు.తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గౌరి నాగేశ్వరరావు,సున్నం గంగా అధ్యక్షతలో జరిగిన మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
సాగులో ఉన్న ప్రతి ఎకరాకు ప్రభుత్వం పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 యాక్ట్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1/70 యాక్ట్ చట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించాలని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లతో కుమ్మక్కై కుట్రలు చేస్తుందని ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖను ఉపయోగించి ఆదివాసి రైతులపై చేస్తున్న దాడులను తక్షణమే ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఏజెన్సీ ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కై ఐక్యంగా ఉద్యమించాలన్నారు.తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు సంవత్సరాల తునికాకు బోనస్ మొత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.గ్రామ సభలను పటిష్టంగా అమలు చేయాలని,పెసాచట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి,ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ డీఎస్సీ ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇంటి స్థలం ఉన్న అర్హులైన ఆదివాసీలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు తక్షణమే ఆపాలని,పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, సరియం కోటేశ్వరరావు,సోయం జోగారావు,పాయం నరసింహారావు,కుంజా శ్రీను, మడివి రమేష్,దుబ్బ గోవర్ధన్, సోడెం ప్రసాద్, కొమరం కాంతారావు,కుంజా రాంమూర్తి, పోడియం వెంకటేశ్వర్లు, సర్పంచ్ లు వగ్గేల రాధా,గంప సూజత, ప్రసాద్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.