కుటుంబానికి అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
- ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ప్రతి కుటుంబానికి అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఉంటుందని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు(MLA Kokkirala Premsagar Rao) అన్నారు. సోమ వారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23, 54, 55, 56, 57 డివిజన్లలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం దరఖాస్తుల స్వీకరణ, ఆన్ లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించిన అనంతరం ఎంఎల్ఏ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో రూ. 5 లక్షల కుటుంబ జీవిత బీమా ప్రతి కుటుంబానికి పెద్ద భరోసా అని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ను రూ. 925 కోట్లతో అభివృద్ధి పథంలో పయనించేలా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇచ్చామని, త్వరలోనే రోడ్లు, డ్రైనేజీలు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
మంచిర్యాలలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, రూ. 350 కోట్లతో ఐబీ చౌరస్తాలో 650 పడకల ఆసుపత్రి, రూ. 11 కోట్లతో మహాప్రస్థానం, రూ. 78 కోట్లతో అండర్ డ్రైనేజ్ విద్యుత్ ఆధునికరణ పనులు, రూ. 6.19 కోట్లతో మంచిర్యాల మున్సిపల్ పరిధిలో ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను తరలించడం, కొత్త విద్యుత్ లైన్లను విస్తరించడం, రూ. 10.50 కోట్లతో విశ్వనాథ ఆలయం, రూ. 20 కోట్లతో నూతన బస్టాండ్, రూ. 120 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆదునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రం గర్వించడంతో పాటు దేశంలో నెంబర్ వన్ గా ఉండాలనే చిత్తశుద్ధి సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.