ఉత్పత్తి అనుగుణంగా ఓబీ తొలగింపు జరగాలి
- జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్,(విజయక్రాంతి): సంస్థ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఏరియా అధిగమించేలా శ్రీరాంపూర్ ఓసీ అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా కృషిచేయాలని జీఎం మునిగంటి శ్రీనివాస్(GM Muniganti Srinivas) కోరారు. శుక్రవారం ఎస్ఆర్పీ ఓసీపీ పని ప్రదేశాలను ఆయన తనిఖీ చేశారు. రక్షణతో కూడిన నిరాంతరయ ఉత్పత్తి సాధన దిశగా క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, ఉద్యోగులకు సూచనలు చేశారు. లక్ష్యానికి అనుగుణంగా రోజు వారి బొగ్గు ఉత్పత్తి జరిగేలా ఓబీ తొలగింపు జరగాలని ప్రైవేట్ ఓబీ కాంట్రాక్ట్ ప్రతినిధులను ఆదేశించారు.
2026-2027 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు సంస్థ కేటాయించిన లక్ష్యం అధిగమించాలంటే ఎస్ఆర్పీ ఓసీలో ప్రతీరోజు 12 వేల టన్నుల బొగ్గు వెలికి తీయాల్సిందేనన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో నవంబర్ 1 నుంచి రోజుకు 5 రేకులు డిస్పాచ్ జరగాలన్నారు. ఏరియా టార్గెట్ సాధనకు సైతం రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వార కృషిచేయాలని పిలుపునిచ్చారు. జీఎంతో పాటు బెల్లంపల్లి రీజియన్ జీఎం(సేఫ్టీ) రఘు కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ CH వెంకటేశ్వర్లు, మేనేజర్ ఐ . శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, సర్వేయర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.