తవక్కల్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

26-10-2026 | 07:39pm

- కలెక్టర్, డీఈఓలకు వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District)లోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ లలో నిర్వహిస్తున్న తవక్కల్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతోందని, సదరు పాఠశాలలపై ప్రత్యేక తనిఖీ బృందంతో సమగ్ర విచారణ జరిపించి గుర్తింపులు రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల (AISB, PDSU, USFI) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) చంద్రయ్యకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.... తవక్కల్ విద్యాసంస్థల ప్రధాన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఎలాంటి ఆటస్థలం లేకుండా, ఇరుకైన సందులో అగ్నిమాపక భద్రత (Fire Safety) లేకుండా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. మందమర్రి లోని చెరువు సమీపంలో  భవనం నిర్మించారని సర్వ్ చేయించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో కేవలం 8వ తరగతి వరకే అనుమతి ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా 10వ తరగతి వరకు తరగతులు నడుపుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వ్యవస్థని, అధికారులని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తుంటే శాంతియుతంగా ప్రశ్నించిన వారిపై  చైర్మన్ అబ్దుల్ అజీజ్ భౌతిక దాడికి దిగి, అందరూ నా కనుసైగల్లోనే ఉన్నారు, ఎవడు మమ్మల్ని ఏం చేయలేడంటూ అహంకారంగా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. రామగుండం సీపీ, విద్యాశాఖ కమిషనర్, ఆర్డీవో, నీటిపారుదల శాఖ, సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు నకళ్లు సమర్పించి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఫిర్యాదులో  పొందుపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో AISB జిల్లా ప్రధాన కార్యదర్శి  కనుకుంట్ల సన్నీ గౌడ్ , PDSU జిల్లా కార్యదర్శి డి. శ్రీకాంత్, USFI జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, నాయకులు సికిందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు