చెన్నూరును పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా..!

26-10-2026 | 07:47pm

మంత్రి వివేక్ వెంకటస్వామి...

చెన్నూర్, (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నానని రాష్ట్ర కార్మిక ఉపాధి, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkatswamy) అన్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరులో సోమవారం పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించడంతో పాటు నూతన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిరువ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతూ రూ.1.20 కోట్లతో 20 దుకాణాల నిర్మాణానికి భూమిపూజ చేశానన్నారు. నాలుగు నెలల్లో వీటిని పూర్తి చేసి, మిగిలిన అర్హులైన చిరువ్యాపారులకు మరో 50 ఆధునిక దుకాణాలను నిర్మించి అందిస్తామన్నారు.

రూ.1.50 కోట్లతో బైపాస్ రోడ్డును ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. 10వ వార్డులో రూ.3.50 కోట్లతో 750 మీటర్ల రోడ్డు విస్తరణ, డబుల్ ఆర్మ్ సెంట్రల్ లైటింగ్‌తో పాటు అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నామన్నారు.

గోదావరి పుష్కరాల నేపథ్యంలో చెన్నూరు అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. ఇందులో భాగంగా గోదావరి తీరంలోని శివాలయాన్ని రూ.17 కోట్లతో అభివృద్ధి చేస్తాం. పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారికి రూ.6 కోట్లు, పోచమ్మ గుడి వద్ద భక్తుల వసతులకు రూ.2 కోట్లు, మహాశివరాత్రికి జైపూర్ వెళ్లే భక్తుల సౌకర్యాలకు మరో రూ.2 కోట్లు కేటాయించమన్నారు. జైపూర్ మండలం వేళాల గ్రామంలో రూ.4.25 కోట్లతో గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

చెన్నూరు శివాలయం, క్రొకడైల్ పార్క్, కాళేశ్వరం ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామనన్నారు. స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తానని అన్నారు.

రోడ్డు విస్తరణకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలకు, వ్యాపారులకు  ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారంతో చెన్నూరు రూపురేఖలను మారుస్తానని అన్నారు..అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు