బెటాలియన్‌లో యువ ఆపదమిత్ర శిక్షణ ప్రారంభం
హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలం గుడిపేటలోని టీజీఎస్పీ 13వ బెటాలియన్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (State Disaster Response Force) ఆధ్వర్యంలో కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మక ‘యువ ఆపదమిత్ర’ శిక్షణ(Youth Emergency Response Team Training)ను బుధవారం కమాండెంట్ కె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఆకస్మిక విపత్తులు సంభవించినప్పుడు అత్యంత వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టే సాంకేతిక నైపుణ్యం యువతకు అవసరమన్నారు.
ముందస్తు రక్షణ చర్యలపై సరైన అవగాహన ఉండటం ద్వారా సమాజంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రాక్టికల్ శిక్షణలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, సమాజ సేవ పట్ల అంకితభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. వరద సమయాల్లో చిక్కుకున్న వారిని రక్షించే విధానాలు, లైఫ్ జాకెట్లు, బోట్ల వినియోగంపై మెళకువలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణ, భవనాలు కూలినప్పుడు లేదా విపత్కర పరిస్థితుల్లో క్షతగాత్రులను సురక్షితంగా వెలికితీసే ఆధునిక పద్ధతులు, గోల్డెన్ అవర్‌లో చేయాల్సిన సీపీఆర్, రక్తస్రావ నివారణ, స్ట్రెచర్ల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ శిబిరంలో శాతవాహన వర్సిటీ, కరీంనగర్ కళాశాలలకు చెందిన మొత్తం 121 మంది విద్యార్థులు ( 68 మంది బాలురు, 53 మంది బాలికలు ) పాల్గొంటున్నారనీ, ఎస్ డీ ఆర్ ఎఫ్ మాస్టర్ ట్రైనర్లు వీరికి క్షేత్రస్థాయిలో సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారన్నారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక శిక్షణా కిట్ బ్యాగులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, యూనిట్ మెడికల్ డాక్టర్ సంతోష్ సింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గౌస్ మొహియుద్దీన్, ఎస్ డీ ఆర్ ఎఫ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం. అశోక్, బెటాలియన్ అధికారులు, ఎస్ డీ ఆర్ ఎఫ్ శిక్షణ సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.