సేవా సంకల్ప్ అభియాన్‌కు శ్రీకారం..
* నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు.
* ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితానికి గుర్తుగా కేంద్రం కార్యక్రమం.
* 22ఏ భూముల లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
* బిజెపి జాతీయ నాయకులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి.
ఖమ్మం, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సేవా సంకల్ప్ అభియాన్‌ను తెలంగాణలో విస్తృతంగా నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో–ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావడమే అభియాన్ లక్ష్యమని చెప్పారు. ఖమ్మంలోని భాజపా జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సేవే సంకల్పంగా.. నెలరోజుల కార్యక్రమాలు
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రక్తదాన శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు. ధరణి నుంచి భూ భారతి వరకు భూ రికార్డుల నిర్వహణలో చోటుచేసుకున్న మార్పులు, 22ఏ నిషేధిత భూముల జాబితా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పెండింగ్ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
22ఏ భూములపై ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు, రాజకీయంగా ప్రచారంలో ఉన్న ఇతర లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబరు వారీగా పూర్తి వివరాలను బహిరంగపరచాలని, ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రం విడుదల చేస్తే అనుమానాలకు తావుండదని అన్నారు..