గ్రామాల సమగ్ర అభివృద్ధికే గ్రామసభలు
పాపన్నపేట, నవంబర్ 26 (విజయ క్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి (Village Development) లక్ష్యంగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోందని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ రజిత రాజశేఖర్ అన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రజలతో నేరుగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం గ్రామ ప్రజలు, మండల అధికారులతో కలిసి ఆరెపల్లిలో గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పంటలపై అవగాహన కల్పించారు. ఖేత్ బచావో అభియాన్, వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద చేపట్టే పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం, జలసిరి, భూసార పరీక్షలు, ఆరుతడి పంటల సాగుపై చర్చించారు. సేంద్రియ వ్యవసాయ విధానాల (Organic Farming) అమలుతో కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ భూసార పరీక్ష కేంద్రం ఏవోలు కవిత, గజలక్ష్మి, ఎమ్మార్వో సతీష్ కుమార్, ఏవో శ్రీనివాస రాజు, ఏఈఓ నరసింహులు, ఉపసర్పంచ్ రేష్మ సలీం, పంచాయతీ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.