ఏడుపాయల్లో దుర్గాదేవిగా వనదుర్గమ్మ
పాపన్నపేట, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మంజీరా నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం అష్టమిని పురస్కరించుకొని వనదుర్గామాతను దుర్గాదేవి (మహా గౌరీ) రూపంలో ఎరుపు రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.
ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, ఎరుపు రంగు చీరతో పాటు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. జిల్లాలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకొని.. చల్లంగా చూడమ్మా వనదుర్గమ్మ తల్లి అంటూ వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు మహిషాసుర మర్దిని దేవిగా వనదుర్గమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం వనదుర్గామాత మహిషాసుర మర్దిని దేవి రూపంలో, మెరూన్ రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి వీరేశం, అర్చకులు తెలిపారు.