షాకింగ్.. బిర్యానీలో బొద్దింకలు
తిన్న కుటుంబానికి తీవ్ర అస్వస్థత
ప్రశ్నించిన బాధితులతో మీకు తోచింది చేసుకోండి అని హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణ పరిధిలోని హైదరాబాదు - వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న 'శ్రీ వందన' హోటల్(Sri Vandana Family Restaurant)కు రుచికరమైన ఆహారం అని నమ్మి వచ్చిన ఒక కుటుంబానికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక(Cockroach) ప్రత్యక్షమవ్వడమే కాకుండా, ఆ కలుషిత ఆహారం తిన్న వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బిర్యానీలో బొద్దింక రావడంతో కడుపునొప్పి, వాంతులతో బాధితులు విలవిలలాడుతుంటే... కనికరం చూపించాల్సిన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. "మీకు తోచింది చేసుకోండి" అంటూ బాధితులపై దుర్భాషలాడటమే కాకుండా, పైగా బిల్లు వసూలు చేయడం హోటల్ నిర్వాహకుల బరితెగింపునకు అద్దం పడుతోంది. పరిస్థితి విషమించి బాధితురాలు కళ్లు తిరిగి పడిపోవడంతో, తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో ఘట్కేసర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, అక్కడ వారిని గాలికి వదిలేసి యాజమాన్యం పరారైంది.
హోటల్‌లో వంటకాలపై కనీసం మూతలు కూడా లేకుండా ఇష్టానుసారంగా ఉంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కేవలం హైదరాబాద్ నగరం లోపలే తనిఖీలు చేస్తూ, ఘట్కేసర్ లాంటి శివారు మున్సిపాలిటీలను పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారుల(Food safety officials) వైఖరిపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. బాధితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిన శ్రీ వందన హోటల్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.