కతార్‌లో అనారోగ్యంతో నడికూడ వాసి మృతి
మల్లాపూర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కతార్ దేశంలో అనారోగ్య సమస్యలతో మల్లాపూర్ మండలం(Mallapur Mandal) నడికూడ గ్రామానికి చెందిన తలారి ముత్తన్న (45) మృతి చెందారు. ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కతార్‌లో ఉంటున్న ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో నడికూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముత్తన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతంలో ఎఫ్ఏగా పనిచేసిన ఆయన సీనియర్ అంబేద్కర్ నాయకుడిగా గ్రామంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేశారు.ముత్తన్న మృతివార్త తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. ముత్తన్న మృతి ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులకు తీరని లోటుగా మారిందని పేర్కొన్నారు. మృతుని కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు. అలాగే కతార్ నుంచి ముత్తన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.