ORS అనుకుని ఎలుకల మందు తాగిన వృద్ధురాలు మృతి

13-11-2026 | 10:46pm

ఘట్ కేసర్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ఓఆర్ఎస్ ప్యాకెట్(ORS packet) అని పొరబడి ఎలుకల మందు(Rat poison) సేవించిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఎదులాబాద్ కు చెందిన తోటకూర రాములమ్మ (73) గత కొన్నేళ్లుగా మధుమేహం (షుగర్) ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. 

ఈనెల 12న మధ్యాహ్నం సమయంలో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో, కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ గోపీకృష్ణను ఇంటికి పిలిపించి పరీక్షించారు. పరీక్షల సమయంలో ముందు రోజు రాత్రి నుండి తనకు తీవ్ర నీరసంగా ఉండటంతో ఓఆర్ఎస్ ప్యాకెట్ అని పొరబడి ఇంట్లో ఉన్న ఎలుకల మందు ప్యాకెట్‌ను తాగినట్లు ఆమె డాక్టర్‌కు తెలిపారు.

వెంటనే డాక్టర్ సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 6:55 గంటలకు ఆమె మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ ధృవీకరించారు.

తన తల్లి మరణానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు తోటకూర మల్లేష్ కోరారు. ఈ మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు