హైడ్రా కంచెలు తొలగించి..!?
- యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా
- ఆపై అక్రమ నిర్మాణాలు
- 2021లోనే ప్రభుత్వ భూములని తేల్చిన రెవెన్యూ శాఖ
- ఫిర్యాదులు, నోటీసులు ఉన్నా క్షేత్రస్థాయిలో చర్యలు ఏవీ?
- బోయిన్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలపై తీవ్ర ఆరోపణలు!
సికింద్రాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): బాలానగర్ మండలం హస్మత్‌పేట గ్రామ పరిధిలోని బోయిన్ చెరువు సర్వే నంబర్ 1,15,17లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు(Government Land Encroachment), అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కోర్టు వివాదం కొనసాగుతోందని స్థానికులు చెబుతుండగా, మరోవైపు ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతూ భూ ముల విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ భూములేనన్న రెవెన్యూ శాఖ..
2021 ఫిబ్రవరి 19న బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ కూ కట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ నంబర్ B/76/2021 హస్మత్‌పేట గ్రామంలోని బోయిన్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని సర్వే నంబర్లు 1, 15, 17లో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణా లు అన్ని లేఖ పేర్కొన్న సంగతి తెలిసింది. 1955 నాటి శేషల పహాణీ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 1లోని 108 ఎకరాల 28 గుంటలు, సర్వే నంబర్ 15లోని 5 ఎకరాల 24 గుంటలు సర్కారీ భూములుగా స్పష్టం చేశారు. అలాగే సర్వే నంబర్ 17లోని 54 ఎకరాల 25 గుంటలను సర్కారీ శిఖం తలాబ్ (బోయిన్ చెరువు)గా ఉంది..
గతంలోనే నోటీసులు..
ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో మొహమ్మద్ రఫీక్ అలీ, మొహమ్మద్ అలీకి తెలంగాణ ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్ 1905లోని సెక్షన్ 7 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్.. సంబంధిత వ్యక్తులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణకు అవకాశం కల్పించిన ఆధారాల ఆధారంగా వారి వాదనలను తిరస్కరిస్తూ తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యాయి
హైడ్రా కంచెలు తొలగించింది ఎవరు?
ఇదిలా ఉండగా, గత ఏప్రిల్‌లో బాలానగర్ రెవెన్యూ అధికారులు, హైడ్రా అధి కారులు సంయుక్తంగా వివాదాస్పద స్థలం లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హెచ్చరిక బో ర్డులు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల ఆ కంచెలను తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు వివాదం, ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైన అంశాలు ఉన్నప్పటికీ భూముల క్రయవిక్రయాలు ఎలా జరుగుతున్నాయన్నది ప్రశ్నా ర్థకంగా మారింది.
ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు?
వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు ఎలా మంజూరయ్యాయన్నది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అనుమతులు ఇచ్చారా? ప్రభుత్వ భూము ల్లో నిర్మాణాలకు సహకరించిన వారెవరు? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు..
హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ హైడ్రా, రెవెన్యూ అధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. రాజకీయ పలుకుబడితోనే కొందరు యథేచ్ఛగా భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించాలి..
బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం 2021లోనే ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జీహెచ్ఎంసీకి లేఖ రాసిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నిర్మాణాలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదా? జీహెచ్‌ఎంసీదా? హైడ్రాదా? అన్నది పక్కన పెడితే ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
సర్వే నంబర్ 1,15,17లోని భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలు, భూముల విక్రయాల ఆరోపణలపై విచారణ జరపాలని, ఫెన్సింగ్‌ను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మించిన అక్రమ నిర్మా ణాల ను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.. అలాగే బాధ్యులుగా తేలిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.