మిల్లుల జల్లెడ!
- సీఎంఆర్ బకాయిలపై సర్కార్ కొరడా
- పదేళ్ల ధాన్యం, బియ్యం లెక్కలపై ప్రత్యేక ఆపరేషన్
- అక్రమాలను ఉపేక్షించబోమని మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
దశాబ్దాల ధాన్యం లెక్కలు, బియ్యం బకాయిల వ్యవహారం తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయంతో ముందుకెళ్తోంది. సుమారు రూ.10 వేల కోట్ల విలు వైన ధాన్యం, సీఎంఆర్ బియ్యం బకాయిల గుట్టు విప్పేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం ఎక్కడికి వెళ్లింది? ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యం ఎవరి పాలైంది? అన్న కోణంలో అధికారులు లోతైన విచారణ చేపట్టారు.
అక్రమాలను వెలికితీసేందుకు రంగం లోకి దిగిన విజిలెన్స్, సీఐడీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు.. రాష్ట్రవ్యాప్తంగా మిల్లులపై ముప్పేట దాడులు నిర్వహిస్తున్నాయి. ఇప్ప టివరకు 26 జిల్లాల్లో సుమారు 300 మిల్లు ల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ.2,200 కోట్ల విలువైన 8.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతూ రూ.1,500 కోట్లు రికవరీ చేయడంతో పాటు, 63 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 25 మందిని జైలుకు పంపారు. అంతేకాదు.. ఆస్తుల జప్తు, యంత్రాల వేలానికి సైతం ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో.. ఇన్నాళ్లూ తెరవెనుక గుట్టుగా సాగిన మిల్లర్ల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. దశాబ్దకాలంగా పేరుకుపోయిన ధాన్యం, బియ్యం బకాయిల లెక్కలను తేల్చేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) నేతృత్వంలో పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ధాన్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం వివరాలను మిల్లుల వారీగా పరిశీలిస్తూ గణాంకాలను సరిచేసే పనిలో పడింది.
ఇందుకోసం విజిలెన్స్, సీఐడీ, టాస్క్‌ఫోర్స్ బందాలను రం గంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, దాడు లు ముమ్మరం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టులు, బకాయిల రికవరీకి చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించినా, సీఎంఆర్ బియ్యం అప్పగించకపోయినా ఉపేక్షించేది లేదని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల రైస్ మిల్లులు ఉన్నాయి. వీరికి ప్రతి సీజన్లో లక్షలాది మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం అందజేసి మిల్లింగ్ చేయిస్తుంది.
మిల్లింగ్ చేసిన బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు, రాష్ట్ర అవసరాల మేరకు పౌర సరఫరాల శాఖకు సీఎంఆర్ కింద అప్పగించడం మిల్లర్ల బాధ్యత. 2022 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్ వేయగా, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 5000 కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉం ది. ఇదంతా పక్కదారి పట్టింది. అలాగే 2012 13 నుంచి ఇప్పటి వరకు (2023 డిసెంబరు చివరి నాటికి) ప్రతి ఏడాదికి సంబంధించి 10 నుంచి 25 శాతం వరకు బియ్యం ఇంకా ప్రభుత్వానికి చేరాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన ధాన్యంకూడా రైస్ మిల్లుల వద్ద లేదు.
ఇదికూడా సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా రైస్ మిల్లుల నుంచి దీర్ఘకాలికంగా అటు బియ్యం ఇవ్వక.. ఇటు మిల్లుల్లో ధాన్యం లేక.. ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. అక్రమాలకు పాల్పడుతూ.. ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకోవడం, లేదా మిల్లింగ్‌చేసి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి లాంటి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. దీనితో ఈ మొత్తాన్ని తేల్చడానికి, మిల్లర్ల నుంచి బకాయిలను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిననిర్ణయం తీసుకుంది.
మూడు విభాగాలతో ఆపరేషన్
దశాబ్దకాలం నుంచి పేరుకుపోయిన అంశం కావడంతో.. అదే స్థాయిలో తనిఖీలు, దాడులు చేస్తేనే అసలు ఎంత రావాల్సి ఉంది.. ఎంత ధాన్యం ఉంది.. ఎంత మాయం అయ్యిందనే పూర్తిస్థాయి గణాంకాలు తేటతెల్లం అవుతాయని మంత్రి ఉత్తమ్‌కుమర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. మరోవంక సీఎం రేవంత్‌రెడ్డికూడా మిల్లర్ల అక్రమ దందాకు ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలనే సూచనలు ఇవ్వడంతో.. మంత్రి వ్యూహాత్మకంగా అధికారులతో ప్రణాళికలు వేశారు.
మూడు విభాగాలతో తనిఖీలు, దాడులకు నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. పౌరసరఫరాల విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో ఎప్పటిలాగే తనిఖీలు, దాడులు మొదలు పెట్టారు. అయితే ఈసారి ఆయా మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను పకడ్బందీగా లెక్కిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో, వందలాది రైస్ మిల్లర్లు.. సన్నరకం బియ్యం కాకుండా.. దొడ్డు రకం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు.
అయితే ప్రభుత్వం (సివిల్ సప్లు విభాగం) ఇచ్చిన వెసులుబాటు (గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యాన్ని కామన్ రకం ధాన్యంగా మార్చడానికి క్వింటాలుకు రూ. 520 చెల్లించాల్సి ఉంది)ను పక్కనపెట్టి.. ఏదో తూతూ మంత్రంగా చెల్లించి దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించినట్టుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐడీ విభాగాన్ని రంగంలోకి దింపారు. దీనితో ఒక్కో మిల్లును జల్లెడ పడుతున్నారు. లెక్కలు తీస్తున్నారు. ఎవరు ఎన్ని లారీల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు. క్వింటాలుకు ఎంత మొత్తం సివిల్ సప్లుకి చెల్లించారు. ఇంకెంత ఇవ్వాల్సి ఉంది.. ఎంత అక్రమం జరిగింది అనేది తేల్చి.. కేసులు పెట్టి, అరెస్టు చేస్తున్నారు. ఇక గ్రేహౌండ్స్ విభాగంలోని సిబ్బంది సహాయంతో టాస్క్‌ఫోర్స్ బృం దాలు కూడా మిల్లులపై దాడులు నిర్వహిస్తోంది.
ఆస్తుల స్వాధీనం, యంత్రాల వేలం
మూడు విభాగాలతో జరుగుతున్న తనిఖీలు, దాడుల నేపథ్యంలో ఒక్కో రైస్ మిల్లరు చేసిన అక్రమాలు బయపడుతున్నాయి. నిజానికి ధాన్యం మాత్రం మిల్లర్ల వద్ద కనపడటం లేదు. దీనితో రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. చాలా మంది మిల్లర్లకు సంబంధించి ఆస్థులను స్వాధీనం (ప్రాపర్టీ అటాచ్) చేసుకునేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు. మరికొన్ని రైస్ మిల్లర్లకు సంబంధించి మిల్లింగ్ యంత్రాలను వేలంపాట వేయాలనే దృఢనిశ్చయంతో సివిల్ సప్లు శాఖ ముందుకు సాగుతోంది.
అలాగే విజిలెన్స్ విభాగం చేస్తున్న దాడుల్లో చాలా జిల్లాల్లోని వందలాది రైస్ మిల్లులకు రికవరీ నోటీసులు ఇచ్చారు. ఒక్క మెదక్ జిల్లాలోనే సుమారు 30 మిల్లల నుంచి సుమారు రూ. 100 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని గుర్తించినట్టు సమాచారం. అలాగే సంగారెడ్డి లో రూ. 20 కోట్లు, సిద్ధిపేట, పెద్దపల్లి లాంటి జిల్లాలో మరింత భారీగా రావాల్సి ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే మిల్లర్ల మాయాజాలానికి చెక్ పడనుందని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు.