ఎన్విడియాకు కొత్త బాస్ ఎవరు?

14-11-2026 | 05:05am

బరిలో ముగ్గురు భారత సంతతి టెక్ దిగ్గజాలు

జెన్సన్ హువాంగ్‌కు అండగా ఎన్విడియా ఉద్యోగులు

కాలిఫోర్నియా, నవంబర్ 13: ప్రపంచాన్ని ఏఐ వైపు పరుగులు పెట్టిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా(Nvidia) 33 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ సంస్థను ఒంటి చేతితో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన జెన్సన్ హువాంగ్.. సీఈవో పదవికి రాజీనామా చేయడంతో సంస్థ భారీ కుదుపునకు గురైంది. ఈ ఉద్ధండుడి వారసుడి కోసం ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. పలువురు ప్రముఖ టెక్ దిగ్గజాల పేర్లను పరిశీలిస్తున్నారు.

ఈ రేసులో ముగ్గురు ప్రవాస భారతీయుల పేర్లపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిప్ రంగం నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ వరకు విశేష అనుభవం ఉన్న భారత సంతతికి చెందిన సంజయ్ మెహ్రోత్రా, నికేష్ అరోరా, థామస్ కురియన్ పేర్లను కూడా ఎన్విడియా సంస్థ తదుపరి సీఈవో పదవి కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక సీఈవోగా కంపెనీ సీఎఫ్‌వో కోలెట్ క్రెస్‌ను నియమించారు.

మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా

సంజయ్ మెహ్రోత్రా అమెరికాకు చెందిన ప్రముఖ మెమరీ చిప్‌ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1988లో శాన్‌డిస్క్ సంస్థను సహ మెహ్రోత్రా.. దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్టోరేజ్ టెక్నాలజీ సంస్థగా తీర్చి దిద్దడంలో కీలకపాత్ర పోషించారు. 2017లో మైక్రాన్ బాధ్యతలు చేపట్టారు. సెమీ కండక్టర్ పరిశ్రమపై లోతైన అవగాహన, తయారీ సంస్థలను నిర్వహించిన అనుభవం మెహ్రోత్రాకు ప్రధాన బలం. అయితే.. ఎన్విడియా వంటి సంస్థలో సీఈవోగా బాధ్యతలు చేపట్టాలంటే చిప్ డిజైన్‌తో పాటు సాఫ్ట్‌వేర్, గ్లోబల్ కస్టమర్ నెట్‌వర్క్‌పై కూడా పట్టుండాలి. 

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ చైర్మన్ నికేష్ అరోరా

నికేష్ అరోరా ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఆయన సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో గూగుల్‌లో కీలక వాణిజ్య బాధ్యతలు నిర్వహించిన అరోరా.. సాఫ్ట్ బ్యాంక్ అనే సంస్థలో అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వ్యాపారాలను నిర్వహించడం, భారీ పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.

2018లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ విస్తరణ, ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సేవలను అభివృద్ధి చేశారు. చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా భవిష్యత్తులో ప్రపంచ ఏఐ మౌలిక సదుపాయాల వ్యవస్థలో కీలక శక్తిగా మారాలంటే వ్యాపార వ్యూహాలు, అంతర్జాతీయ సంబంధాలు, భారీ సంస్థల నిర్వహణలో అనుభవం ఉన్న అరోరా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. అయితే.. ఆయనకు ప్రత్యక్ష సెమీకండక్టర్ చిప్ డిజైన్ అనుభవం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారనుంది. 

గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్

గూగుల్ క్లౌడ్ సీఈవోగా ఉన్న థామస్ కురియన్ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, ఏఐ సేవల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్‌లో చేరడానికి ముందు ఆయన ఒరాకిల్‌లో ఉత్పత్తుల అభివృద్ధి విభాగంలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంస్థలకు సాంకేతిక సేవలను అందించడం, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో పోటీని ఎదుర్కోవడం, ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడం వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఎన్విడియాకు గూగుల్ క్లౌడ్‌తో ఇప్పటికే వ్యాపార సంబంధాలున్నాయి. ఏఐ డేటా సెంటర్ల అభివృద్ధిలో ఎన్విడియా చిప్‌లకు ఉన్న ప్రాధాన్యత కురియన్‌కు బాగా తెలుసు. అయితే.. చిప్‌ల తయారీలో ప్రత్యక్ష అనుభవం లేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ కానుంది. 

జెన్సన్ సీఈవోగా కొనసాగాలంటున్న టెక్ దిగ్గజాలు

ఈ ముగ్గురు ఎన్నారైలతో పాటు ఎన్విడియా తాత్కాలిక సీఈవో కోలెట్ క్రెస్, ఆ సంస్థలోనే కీలక స్థానంలో ఉన్న ఇయాన్ బక్, బ్రిటిష్ చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ సీఈవో రెనేహాస్, ఏఎండీ సీఈవో లీసా సూ, ఇంటెల్ మాజీ సీఈవో పాట్ గెల్సింగర్, ఆపిల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టిమ్ కుక్, ఆపిల్ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ జానీ స్రౌజీ, మార్వెల్ టెక్నాలజీ సీఈవో మాట్ మర్ఫీ పేర్లు కూడా ఎన్విడియా బోర్డు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు.. జెన్సన్‌ను ఎన్విడియా సీఈవోగా కొనసాగించాలంటూ ఆ సంస్థ ఉద్యోగులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

జెన్సన్‌కు ఇప్పటి వరకు 1,600 మంది ఉద్యోగులు అండగా నిలిచారు. అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పెర్‌ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్, ఎపిక్ గేమ్స్ సీఈవో టిమ్ స్వీనీ, ఓపెన్ క్లా సృష్టికర్త పీటర్ స్టెయిన్ బర్గర్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఎన్విడియా సీఈవోగా జెన్సన్ కొనసాగాలని గట్టిగా వాదిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎన్విడియా కంపెనీకి చెందిన మరో ఉద్యోగినితోనూ వివాహేతర సంబంధం ఉందని జెన్సన్ అంగీకరించారు. అయితే.. ఆ మహిళ పేరును వెల్లడించలేదు. దీంతో ఆయన వివాహేతర సంబంధాల సంఖ్య మూడుకు చేరింది. 


మరిన్ని వార్తలు