అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం

14-11-2026 | 05:00am
  1. 26 మంది మృతి
  2. మినీ బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీ
  3. మృతుల్లో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులే

గువాహటి, నవంబర్ 13: అసోంలో ఘోర రోడ్డు(Assam Road Accident) ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కజిరంగ జాతీయ పార్కు సమీపంలో వేగంగా వచ్చిన మినీ బస్సు, కంటైనర్ ట్రక్కు ఎదురెదురుగా డీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులే ఉన్నారు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు పూర్తిగా నుజ్జు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కళాశాల తరగతులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఈ బస్సులో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కూడా చనిపోయారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు. ప్రమాదానికి గురైన బస్సు గతంలో చాలా సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనల కు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో రూ.38,500 విలువైన 12 చలాన్లు కూడా ఈ బస్సుపై నమోదయ్యాయి. ఇప్పటికీ రూ.4000 చలాన్ పెండింగ్‌లో ఉంది. అతివేగానికి సంబంధించిన ఉల్లంఘనలు కూడా ఉన్నాయి. పార్క్ సమీపంలో వేగ పరిమితులను లెక్క చేయకుండా అతి వేగంగా బస్సు ను నడిపించడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరిన్ని వార్తలు